|
ఈరోజు మధ్యాహ్నం బాపు గారి సోదరులైన శ్రీ శంకరనారాయణ గారు స్వర్గస్తులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము.
వీరికి మన అమరజీవి సమితి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానము, గౌరవమూను. ఇప్పటివరకు మన సమితి నిర్వహించిన మాలతిచందూర్, చందూర్ పురస్కార కార్యక్రమలకి ఆ పురస్కార గ్రహీతల రేఖా చిత్రాలు మరియు నెల నెలా వెన్నెల కార్యక్రమాలలో పాల్గొన్న కొంతమంది అతిథుల చిత్రాలు ఎంతో అందంగా చిత్రించి (ఉచితంగా) ఇచ్చారు. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చారు. బాపుగారి వలే శంకరనారాయణ గారు కూడా చాలా మృదు స్వభావి. ఎప్పుడూ ప్రచారం కోరుకోని వ్యక్తి.
వారు వార్ధక్యం వల్ల వచ్చే అనారోగ్యంతో కన్నుమూశారు. వారి ఆత్మకు శాంతి చేకూరి, వారికి ఉత్తమలోకాలు కలగాలని ప్రార్థిద్దాం.
అలాగే వారి కుటుంబానికి, బాపురమణల కుటుంబాలకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తరఫున ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాం
Anyone who is sincere can become the director for AIR, but to be Bapu's brother one need to have good fate.
నిజాయతీ నిబద్ధత ఉన్న ఎవరైనా ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ అవ్వగలరు కానీ బాపుగారి సోదరుడు అవ్వాలంటే అదృష్టం ఉండాలి.
ఈ మాటలు అన్నది "సత్తిరాజు శంకర నారాయణ" అనబడే ఒక కలియుగ లక్ష్మణుడు
ఈ లక్ష్మణుడు నిరంతరం రాముడిని వెన్నంటి ఉండలేదు. రాముడి మదిలో సౌమిత్రి, ఆతడి హృదిలో దాశరధి. అలా సాగింది వారి అవ్యాజమైన ప్రేమ.
బాపూరమణలు స్నేహానికి ఒక అందమైన తార్కాణం. కానీ జీవించి ఉన్నంత కాలం అన్న ఎదుట కూర్చోకుండా కనీసం గట్టిగా మాట్లాడని తమ్ముడు ఈ రోజుల్లో ఉన్నాడంటే నమ్మగలమా. అన్నంటే భయం, అంతకు మించి భక్తి అంతే ఆరాధనా భావం కలిసిన అనిర్వచనీయమైన ప్రేమ ఉన్నాయంటే నమ్మగలమా.నమ్మాలి, ఎందుకంటే శంకర నారాయణ గారు ఏనాడు అన్న బాపూగారి ఎదుట కూర్చో లేదు, ఆయనని తూలనాడి ఎదిరించలేదు.
MA చేసి ఖాళీగా ఉన్నప్పుడు అన్నగారికి రమణ గారికి డ్రైవర్గా "సరదా"పడి, వారి "లావాదేవీలు" పద్దురాసుకుని వారికే గుర్తు చేసి వారికి కార్యదర్శిగా సహాయపడి, పట్టుబట్టి మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాయించి వివిధ స్థాయిల్లోకి ఎదిగి ఎన్నో ప్రాంతాల్లో ఉద్యోగిగా అధికారిగా సేవలందించి, మద్రాస్ రేడియో స్టేషన్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన పాలనా దీక్షాదక్షుడు శంకర్ గారు.
ఉద్యగంలో ఉండగా అడపాదడపా పెన్సిల్ చెక్కినా పదవీ విరమణ చేశాక పూర్తిగా పట్టుకుని తన చూపుడు వేలుగా మార్చుకుని శివ సాయుజ్యం చెంది "శాంతా" సాంగత్యం పొందే వరకు వదలని చేయితిరిగిన "గీత"కారుడు.
ఆయన ప్రతిభకు గొప్ప ఉదాహరణ, హిందూ పత్రికలో అన్న బాపుకి దక్కని ఘనత శంకర్ గారికి దక్కడం. వారు వేసిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారివి వివిధ వయసుల్లో జీవితకాల చిత్రాలు అన్ని అర ఠావు సైజులో ప్రచురితం అవ్వడం.
అలాగే 1992లో తిరుపతిలో కాంగ్రెస్ ప్లీనరీ అయినపుడు ఏకైక తెలుగు ప్రధాని శ్రీ పీవీ గారి చిత్రం ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో పడితే బాపుగారు చూసి ఎవరో గొప్ప చిత్రకారుడు సజీవత్వం ఉట్టిపడుతోందని మెచ్చుకుంటే, వేసిన శంకర్ గారు "నేనేరా అన్నయ్యా" అంటూ వెనుక నిల్చుని సిగ్గుపడుతూ చెప్పిన నిగర్వి.వ్యక్తిగా నిరాడంబరుడు, పాలనా దక్షుడిగా నవ్వుతూనే "నో" చెప్పగల ఉద్దండుడు
ముళ్ళపూడి వారి "వరప్రసాదానికి" "అరుణ" వర్ణం కూర్చి అన్న బాపూగారితో బాటు తనకి చిరకాల మిత్రుడైన రమణగారితో నెయ్యాన్ని వియ్యంగా మార్చుకున్న అనుభవజ్ఞులు. తన ఇంట్లోని వారి వెన్నుదన్నులతో తన పిల్లలకు కులాంతర, మతాంతర వివాహాలు చేసేంత విశాల దృక్పధం కలిగి ఉన్నా ఎవరి చేతా భజంత్రీలు కొట్టించుకోని పరమ మోహమాటస్థులు.
పదవీ విరామ జీవితాన్ని కళా సాధనతో పరిపూర్ణంగా పండించుకున్న ధన్యజీవి శ్రీ శంకర నారాయణ గారు.
ఇలా చెప్పె కొద్దీ ఎన్నో.
ఆనాడు త్రేతాయుగంలో లక్ష్మణుడు ముందు అవతారం చాలిస్తే భ్రాతృ వియోగం తట్టుకోలేక రాముడు కూడా అవతార సమాప్తి చేసి వైకుంఠం చేరాడు. కానీ ఈనాడు ముందు అన్న వెళ్ళిపోతే ఆ భ్రాతృ వియోగాన్ని తాను ఆరు సంవత్సరాల పాటు భరించి అన్నను భార్యను మిత్రులనూ ఈనాడు చేరుకున్నారు శంకర్ గారు.
పుట్టిన వారందరు గిడతారు ఇది ప్రకృతి ధర్మం. కానీ కొందరు మాత్రం అభిమానుల హృదయాలు తమ శాశ్వతారామాలుగా చేసుకుంటారు అది సత్యం.
అలాంటి వారే బాపూరమణలు, శంకరనారాయణ గారు.
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి
సభక్తికంగా
అమిరపు నాగేశ్వరరావు
9848386461
9704532281
🌼“వంకలులేని రీతి నెలవంకలలేఖిని తీర్చు రూపపున్
పొంకము లచ్చుగ్రుద్దినటు పోల్పగజేయు కళావిలాస,యో
శంకరగణ్యనారయణ! చక్కనిమెత్తని వ్రేళ్ల అంచులన్
పంకజనేత్ర నిల్చెనొకొ నాట్యసరస్వతి విద్యనేర్వగన్!”
- Sri Puvvada Athikkana Somayaji
Very sorry to hear the news. Such a great personality. Awesome individual. Very kind in nature. Really can't believe this. Such a great loss.
He lived his life with great dignity and dedication to the society and all his passionate drawings are now with us to cherish. May his soul RIP.
Stay strong. His blessings are always there to you and your family members.
My deepest condolences to one and all in your family.............Jayachandran - Kothari Karuna Flats Association , Chennai
By KANAGALA YOGANAND (Youngest Brother-in-law)
శ్రీరామ
బావగారు. మితభాషి, మృదుభాషి. శాంతాశంకర్ అని శాంతని అనేవాళ్లు. ఆ పిలుపు బావగారికి సరిపోతుందనుకుంటా, శాంతంగా వుండే శంకర్. అంత శాంత స్వభావం. ఆయనకి కోపం రావడం ఎప్పుడూ చూడలేదుగానీ, వచ్చివుంటే వేరేగదిలోకి వెళ్లి ఆయనని ఆయనే దండించుకుని కోపం తగ్గించుకునేవారేమో.
1964 లో శాంతతో పెళ్లయింది. పెళ్లిచూపులయ్యాక ఆయన పంపిన ఫొటో వెనుక "ఎప్పుడూ ఇంతే" అనివ్రాసి పంపించారు. పెళ్లి కుదిరినప్పుడు ఎవరో అమ్మతో కామెంట్ చేసారుట, బావగారి రూపురేఖల గురింఛి. దానికి అమ్మ సమాధానం - మగవాడికి అందం ఎందుకండీ! గుణం ముఖ్యంగానీ. తల్లితండ్రులని, భార్యాబిడ్డల్ని ఎలాచూసుకున్నాడు, ఇతరులని ఎలా గౌరవిస్తాడూ అన్నది ముఖ్యంగానీ, అని. అమ్మ భావాలకి అతికిపోయేలానే వుండేవారు బావగారు.
చిన్నా పెద్దా అనిలేకుండా అందరినీ గౌరవించడం ఆయన స్వభావం. తెచ్చిపెట్టుకున్నది కాదు. ఆయన కూర్చుని వుండగా, ఆయనకంటే బాగా చిన్నవాళ్లమయిన మేము వెళ్లినా వెంటనే లేచి పలకరింఛడం ఆయనకే చెల్లు. మనకి సరైన సీటు లేకపోతే ఆయన లేచి నించుని మమ్మల్ని కూర్చోమనేవారు. తనకంటే ఎంతో చిన్నయిన జయని, వదినలని "మీరు" అని సంభోదించడం, ఇవన్నీ మనం చేయగలమా!
అందరం కూర్చుని మాట్లాడుతూ వుంటే అక్కడే వుండి మన మాటలని ఎంజాయ్ చేసేవారు, ఆయన ఏమీ మాట్లాడకుండానే. నా టాపిక్ కాదులే, లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకుందామన్న ఆలోచనే లేకుండా.
చిన్న చిన్న సరదాలు. ఓ జీడి తినాలని, ఓ తేగ తినాలని వంటి అతి చిన్న కోరికలు. చిన్నప్పుడు ఏలూరుకి వచ్చినప్పుడు ఆ జీళ్ల కొనడం కోసమని నేనూ బావగారూ రిక్షాలో పెద్దబజారుకి వెళ్లి వచ్చేవాళ్లం. జీళ్లు, తేగల ఖర్చుకంటే రిక్షా ఖర్చే ఎక్కువయ్యేది.
అతి మొహమాటం. ఇంకోసారి కాఫీకావలన్నా చిన్నగా అనేవారు, కాఫీ త్రాగితే బాగుంటుందేమోనని. అమ్మ చేసిన బంగాళాదుంపల వేపుడంటే ఆయనకి చాలా ఇష్టంగా వుండేది. మాతో ఎవరితోనయినా అనేవారు, అమ్మకి చెప్పమని. అలాగే ఏదయినా ఇష్టమయినది కావాలంటే శాంతని కూడా అడిగేవారో కాదో లేదా పిల్లలతో చెప్పించేవారేమోనని, నాకు అనుమానమే.
ఆయన గీసిన ఓ పోర్ట్‌రైట్‌ని బాగుందంటే చాలు ఎంతో మురిసిపోయేవారు. అంతలా చిన్నపిల్లవాడి స్వభావం.
సుమారు నాలుగున్నర ఏళ్లు బావగారు, శాంత, పిల్లలతో కలిసి వున్నాను. నాకు గుర్తుండి, ఆయన నన్ను ఎప్పుడయినా అరటిపళ్లు తెచ్చిపెట్టమని మాత్రమే అడిగేవారు. అంతే. క్రమశిక్షణ కోసమని నేనెప్పుడయినా పిల్లల్ని గట్టిగా అదమాయించినా, కొట్టినా నన్నేమి అనేవారు కాదు, ఆయన కళ్లల్లో చిన్నగా తడి అయ్యేదిగానీ. నేనప్పుడప్పుడు బీరు ఇంటికి తెచ్చుకుని పిల్లలు చూడకుండా త్రాగేవాడిని, బావగారికి, శాంతకి తెలుసు. ఒకసారి అత్తయ్యగారు (బావగారి అమ్మగారు) వచ్చి కొన్ని నెలలు వున్నారు. ఒకరోజున బావగారు నాతో అన్నారుకదా, "ఆనందూ! నీకు బీరు త్రాగాలనుకుంటే పోనీ ఏదయినా బార్‌కి వెళ్లి త్రాగేసి రా!" అన్నారు. అంతలా కో-ఆపరేట్ చేసే బావగారు ఎవరికయినా దొరుకుతారా?
నాకు సంబంధాలు చూస్తున్నప్పుడు అమ్మావాళ్లు వైజాగ్ వస్తే వాళ్లతోబాటు, శాంత, బావగారు కూడా వెళ్లి చూసివచ్చారు. నేను వెళ్లలేదు. అన్నీ అయ్యాక బావగారు నాతో చెప్పారు, జయని ఒక్కర్తినే చూస్తేచాలని. అలా మా పెళ్లి కుదిరింది.
బావగారు మాకు ఒక్కరికే కాదు, ఫణి ఫ్రెండ్సుకి, నా ఫ్రెండ్సుకి అందరికీ బావగారే. అందరికీ ఆయనంటే ఇష్టం, ఎంతో గౌరవం.
చివరగా ఆయనతో 21 జూన్ ప్రొద్దున్న మాట్లాడాను. అప్పుడు బాగానే మాట్లాడారు. నేనే ఆయనకి స్ట్రెయిన్ అవ్వకూడదని క్లుప్తంగా ముగించేసాను.
కోవిడ్ (అ)ధర్మమాని ఆయనని కడసారి చూడకుండానే అంతా అయిపోయింది.
అయినా మా ఐదు కుటుంబాల్లో పెద్దయిన బావగారి స్థానం మా హృదయాల్లో ఎప్పుడూ అలాగే సుస్థిరంగా వుంటుంది.
https://www.facebook.com/100002575152775/posts/3035537549875387/?sfnsn=wiwspwa&extid=iAkJk8TBS5YL9iBl&d=w&vh=i
https://64kalalu.com/pencil-artist-shankaranarayana-sattiraju/0/
http://airddfamily.blogspot.com/2020/07/sri-ssankaranarayana-popularly-known-as.html
https://www.facebook.com/1240667867/posts/10222629110816709/?d=n